భారత మాజీ ప్రధాని, తెలుగు వారి కీర్తి వెలుగు, తెలుగు తేజం పీవీ నరసింహరావుకు (పాములపర్తి వెంకట నరసింహారావు ), కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించింది. మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్‌లకు కూడా భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు.
కొద్ది రోజుల క్రితమే ఎల్.కె .అద్వానీ, బీహార్ మాజీ సీఎం, కర్పూరీ ఠాకూర్‌కు కూడా కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రికార్డు స్థాయిలో మొత్తం ఐదుగురికి ఈ ఏడాది 5 భారతరత్న అవార్డులు ప్రకటించినట్టయ్యింది.
సాధారణంగా ఏడాదికి 3 భారతరత్న అవార్డులు ఇస్తారు. కానీ ఈ ఏడాది ప్రభుత్వం ఐదుగురికి ప్రకటించడం విశేషం.అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం 1999లో అత్యధికంగా నలుగురు ప్రముఖులకు భారతరత్న అవార్డులను ప్రకటించింది. ఆ సంవత్సరంలో జయ ప్రకాష్ నారాయణ్, ఆమర్త్యసేన్, గోపీనాథ్ బోర్డోలోయ్, రవి శంకర్లకు ఈ బిరుదు ప్రదానం చేశారు. ఇప్పుడు ఏకంగా ఐదుగురికి ప్రకటించి యావత్ దేశాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది కేంద్ర ప్రభుత్వం.