పిఠాపురంలో పవన్ విజయావకాశాలు ఎలా వున్నాయి ?


 

నేను ఈ 2024 అసెంబ్లీ ఎన్నికలకు పిఠాపురం నుండి పోటీ చేస్తున్నాను”, అని పవన్, మార్చ్ 14 న జరిగిన జనసేన 10 వ ఆవిర్భావ సభ లో ప్రకటించగానే అభిమానుల కరతాళధ్వనులతో సభ మారుమ్రోగిపోయింది. గత కొన్ని రోజులగా, పవన్ ఎంపీ గా పోటీ చేస్తారా, ఎమ్మెల్యే గా పోటీ చేస్తారా లేదా లేదా రెండింటి లోను పోటీ చేస్తారా, అలాగే పవన్ పోటీ చేసే స్థానం, భీమవరమా, పిఠాపురమా ,తిరుపతా , అనే సస్పెన్సు , పవన్ ఈ రోజు ప్రకటనతో, వీడింది. 2019 ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన, గాజువాక, భీమవరం, రెండు స్థానాల్లోనూ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల పరాజయానికి ప్రతిగా, 2024 లోనూ భీమవరం నుండి పోటీ చేసి ఖచ్చితంగా గెలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అభిమానులు భావించేవేళ, పవన్ ఈ 2024 ఎన్నికలకు పోటీ చేసే స్థానం పిఠాపురానికి మారడంతో, అభిమానులు ఆనందాశ్చర్యాలు వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం లో పవన్ గెలుపు అవకాశాలపై చర్చించే ముందు, భీమవరం లో పవన్ పరాజయం చెందటానికి కారణాలు చూద్దాము.

భీమవరం లో 2019 ఎన్నికల్లో, వైసీపీ తరుపున పోటీ చేసిన గ్రంధి శ్రీనివాస్ కు 70,642 ఓట్లు వస్తే, టీడీపీ తరుపున పోటీ చేసిన పులపర్తి రామాంజనేయులకు 54,036 ఓట్లు, జనసేన తరుపున పోటీ చేసిన పవన్ కు 62,285 ఓట్లు వచ్చాయి. టీడీపీ+జనసేన కు కలిపి 1, 16, 321 ఓట్లు వచ్చాయి. వైసీపీ కన్నా, టీడీపీ,జనసేన కు కలిపి 45,679 ఎక్కువ వచ్చినా, టీడీపీ ,జనసేన మధ్య ఓట్లు చీలిపోవడం వల్ల , వైసీపీ లాభపడి పవన్ ఓడిపోయాడు. అదే జనసేన ఒక్కటే, భీమవరంలో పోటీ చేసి ఉంటే, ఓట్లు టీడీపీ,జనసేన మధ్య చీలకపోవడం వల్ల పవన్ గెలిచే ఛాన్స్ ఉండేది. ఇప్పుడు 2024 లో పవన్ కు జనసేన కొన్ని సీట్లు గెలవడంతో పాటు, తాను కూడా గెలవడం జీవన్మరణసమస్య. అందుకే ఇప్పడు పవన్ తాను తక్కువ సీట్లు తీసుకుని ,టీడీపీ తో కలిసి పొత్తు తో 2024 ఎన్నికలకు వెళ్ళేది అందుకే.

రాబోయే ఎన్నికల కోసం జనసేన మొదటి నుంచీ కాకినాడ జిల్లాపైనే ఎక్కువ దృష్టిసారించింది. గతేడాది పవన్‌ ప్రారంభించిన తొలివిడత వారాహి యాత్ర కూడా ఈ జిల్లా నుంచే ప్రారంభించారు. ఈ సందర్భంగా పిఠాపురంలో రెండ్రోజులు బసచేసి.. ఇక్కడ పార్టీ ఆఫీసు కూడా ప్రారంభిస్తామని ప్రకటించారు. మరోపక్క కొన్ని రోజుల కిందట పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు వద్ద నాలుగు ఎకరాల్లోని ఓ హెలిప్యాడ్‌‌ను జనసేన రెండు నెలలకు లీజుకు తీసుకుంది. పిఠాపురం నుంచి పోటీచేసే ఉద్దేశంతోనే ముందుగానే హెలిప్యాడ్‌ను సిద్ధం చేసినట్లు తాజా ప్రకటనతో అర్థమైంది. ఎన్నికల గంట మోగగానే పవన్‌ పిఠాపురానికి నేరుగా హెలికాప్టర్‌లో వచ్చి నామినేషన్‌ వేస్తారని.. ప్రచారం కూడా చేస్తారని అంటున్నారు.

మార్చ్ 14 న పవన్, తాను పిఠాపురం నుండి పోటీ చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో. కాపు ఓటర్లు అధికంగా వుండే, పిఠాపురం లో పవన్ విజయావకాశాలు ఎలా వున్నాయి ?

2014 లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన SVSN వర్మ , 47,000 ఓట్ల మెజారిటీ తో గెలిచాడు, అదే వర్మ 2019 లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయాడు. 2019 ఎన్నికల్లో టీడీపీ ,జనసేన కు కలిపి 96,478 ఓట్లు వచ్చాయి, వైసీపీ కి 83,459 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి కన్నా టీడీపీ+జనసేన కు ఓట్లు ఎక్కువ వచ్చినా, భీమవరం లాగే ఇక్కడ కూడా టీడీపీ,జనసేన మధ్య ఓట్లు చీలిపోయి , 13,000 వేల మెజారిటీ ఓట్లతో వైసీపీ గెలిచింది.

ఇప్పటికే కాకినాడ రూరల్‌ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి పంతం నానాజీని ప్రకటించారు. మరోవైపు.. కాకినాడ ఎంపీ సీటు కూడా దాదాపు జనసేనకే ఖాయమైంది. పవన్‌ పిఠాపురం నుంచి బరిలోకి దిగితే ఆ ప్రభావంతో కాకినాడ రూరల్‌, ఎంపీ స్థానం కూడా సునాయాసంగా గెలవచ్చనేది జనసేన వ్యూహంగా ఉంది.

అందువల్ల, పిఠాపురం లో ఇప్పుడు పవన్ ఒక్కడే పోటీ చేస్తే, టీడీపీ+జనసేన ఓట్లు కలిపితే, వైసీపీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం బాగా ఉండటం వల్ల ,పవన్ ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ వుంది. అయితే, దానికి పిఠాపురం లో టీడీపీ ఓట్లు మెజారిటీ శాతం ,జనసేన కు బదిలీ అయితేనే పవన్ గెలుపు సాధ్యం అవుతుంది. ప్రస్తుతం,టీడీపీ జనసేన మధ్య సయోధ్య కుదిరి, ఇద్దరి పార్టీ క్యాడర్లు అన్ని చోట్ల, బాగా కలిసి పని చేస్తుండటం వల్ల అది సమస్య కాబోదు. కానీ అనుకోని పరిణామం జరిగింది, పవన్ ,పిఠాపురం లో తాను పోటీ చేస్తున్నానని ప్రకటించిన మార్చ్ 14 నే, , పిఠాపురం టీడీపీ క్యాడర్ లో , తమకు కాక, జనసేన కు ఈ స్థానం కేటాయించడం పట్ల ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి, టీడీపీ తరుపున అభ్యర్థిగా పోటీ చెయ్యాలని ఆశిస్తున్న SVSN వర్మ అభిమానులు, పిఠాపురం లో వీధుల్లో చంద్రబాబు ను నిందిస్తూ, ధర్నాలు చేసారు, టీడీపీ జెండాలు తగలబెట్టారు. ఈ పరిస్థితి ఇప్పుడు టీడీపీ,జనసేన కు ఇబ్బందిగా మారింది. వర్మ, కొద్దీ రోజుల క్రితమే ఈ సీట్ పవన్ కు కేటాయిస్తే, తానే దగ్గరుండి గెలిపిస్తానని కొన్ని మీడియా ల్లో చెప్పాడు, కానీ ఇప్పుడు అయన కూడా యూ టర్న్ తీసుకున్నట్టు కనబడుతోంది.

ఇప్పుడు వర్మ కనుక, టీడీపీ రెబెల్ గా మారి, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే, అది పవన్ గెలుపు కు అడ్డంకి గా మారుతుంది, ఖచ్చితంగా టీడీపీ ఓట్లను అయన చాలా చీలుస్తారు. అయన ఇండిపెండెంట్ గా పోటీ చేయకుండా, టీడీపీ అధిష్టానం ఆయనను బుజ్జగిస్తుందేమో చూడాలి. కానీ ఈలోగా టీడీపీ వైఖరి పట్ల అసంతృప్తి గా వున్న వర్మను , వైసీపీ లాగేసుకుని తమ పార్టీ తరుపున పోటీ చేయిస్తే, అప్పుడు కూడా అది పవన్ గెలుపు కష్టం అవుతుంది. పవన్ ఇక్కడ పోటీ చేస్తే, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వుండే, 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కచ్చితంగా ఆ ప్రభావం ఉంటుందని ఆశిస్తున్న జనసేన తరుపు అభిమానులు మాత్రం, టీడీపీ అధిష్టానం పవన్ కు సహకరించే విధంగా సాధ్యమైనంత త్వరగా వర్మను ఒప్పించాలని కోరుతున్నారు. రాబోయే రెండు రోజుల్లోఈ వివాదం ముగింపుకు వచ్చే అవకాశం వుంది.

 

Leave a Comment