2019 వరకు ఆయన పేరు అంతగా ట్రేండింగ్ లో లేదు, 2019 లో వైసీపీ ఎంపీ గా పోటీ చేసి, నరసాపురం నుండి గెలిచినప్పుడు కూడా ట్రెండింగ్ లో లేదు. కానీ ఎప్పుడైతే, వైసీపీ పార్టీ మీద, జగన్ మీద తిరుగుబాటు చేసి, వైసీపీ పార్టీ రెబల్ గా మారి వైసీపీ పార్టీని , జగన్ ను విమర్శించడం మొదలుపెట్టారో , దానిని అవకాశంగా తీసుకుని టీడీపీ అనుకూల మీడియా ఆయనను డిబేట్ లకు పిలిచి ఆయనకు ప్రాచుర్యం కల్పించడం మొదలు పెట్టిందో , ఆయన పేరు ట్రేండింగ్లోకి వచ్చింది, పాపులర్ అయ్యారు . టీడీపీ అభిమాన వర్గాలు, ఆయనను స్వంతం చేసుకోవడం మొదలు అయ్యింది. ఆయనే అభిమానులు RRR గా పిలుచుకునే కనుమూరు రఘురామ కృష్ణరాజు.
ఆంధ్ర యూనివర్సిటీ లో మాస్టర్ అఫ్ ఫార్మసీ చేసిన రఘురామరాజు, 2014 లో వైసీపీ లో వున్నారు. 2014 లో వైసీపీ నుండి ఆయనకు ఎంపీ టికెట్ రాకపోవడంతో ఆయన బీజేపీ లో జాయిన్ అయ్యారు. ఎన్నికల సమయంలోనూ ఆయన నర్సాపురం నుంచి పోటీకి బీజేపీ తరపున ఏర్పాట్లు చేసుకుంటే… పొత్తులో భాగంగా సీటు వచ్చినా… బీజేపీ గోకరాజు గంగరాజుకు సీటిచ్చింది.. తర్వాత ఆయన తప్ప ఆయన కుటుంబీకులంతా వైసీపీలో చేరిపోయారు. 2018 లో టీడీపీ లో చేరి కొంత కాలం వున్న తరువాత, తిరిగి వైసీపీ లో జాయిన్ అయ్యారు. ఆయనకు వైసీపీ 2019 ఎన్నికల్లో నరసాపురం ఎంపీ టికెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో, 31,909 ఓట్ల మెజారిటీ తో గెలిచారు.
జగన్ తో విభేదాలు
నవంబర్ 2019 నుండి ఆయనకు జగన్ తో విభేదాలు రావడం మొదలు పెట్టాయి. ఆ రోజు నుండి వైసీపీ ప్రభుత్వం మీద, బహిరంగంగా విమర్శల బాణం ఎక్కుపెట్టారు. దానితో జులై 2020 లో ఆయనను , "పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు కొనసాగిస్తున్న కారణాన ", ఆయనపై ఎంపీ గా అనర్హత వేటు వెయ్యాలని , వైసీపీ పార్లమెంటరీ పార్టీ లోక్ సభ స్పీకర్ కు వుత్తరం రాసింది. 14 మే 2021 న రఘురామ హైదరాబాద్ లో తన ఇంటిలో వుండగా, ఆయన పుట్టిన రోజునే , రాజద్రోహం కేసు పెట్టి, AP CID పోలీస్ లు అరెస్ట్ చేసి, విజయవాడ తీసుకొచ్చారు. కస్టడీ లో ఉండగా తనను కొట్టారని, రఘురాం కోర్ట్ కు తెలపడంతో, సికిందరాబాద్ ఆర్మీ ఆసుపత్రి నివేదిక ను కోర్ట్ కోరింది, దానితో పాటు రఘురామ కు కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఆ నాటినుండి, అరెస్ట్ భయంతో ఆంధ్ర ప్రదేశ్ లోని తన నియోజకవర్గానికి రాకుండా, ఢిల్లీ లోనే వుంటూ, వైసీపీ ప్రభుత్వం మీద పోరాటం మొదలు పెట్టారు. రచ్చబండ అనే రోజు వారి ప్రోగ్రాంతో, అలాగే మీడియా డిబేట్ లలో, వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను, వైఫల్యాలను ఎండగడుతూ, వైసీపీ కి కొరకరాని కొయ్యగా మారారు.
వర్తమానానికి వస్తే
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో,లోక్ సభ ఎన్నికల్లో, ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలిపోకూడదని , వైసీపీ ఎట్టిపరిస్థితుల్లోనూ తిరిగి అధికారంలోకి రాకూడదనే ప్రయత్నంలో భాగంగా టీడీపీతో తాను పొత్తులో వెళ్తున్నాని , బీజేపీ కూడా తమతో జత కూడాలని కోరుతున్నాన ని, పవన్ మీడియా తో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలను రఘురామ స్వాగతించారు. టీడీపీ-జనసేన కూటమికి బీజేపీ జతకూడాలని పవన్ ఢిల్లీ లో చేసిన ప్రయత్నాలకు ,రఘురామ కూడా ఎంతో సహకారం,సహాయం అందించారు. అవకాశం వచ్చినప్పుడల్లా మోడీ ని బీజేపీ ప్రభుత్వాన్నీ , ప్రశంసిస్తూనే వున్నారు. ఎట్టకేలకు పవన్ ప్రయత్నం ఫలించి, బీజేపీ, టీడీపీ-జనసేన కూటమిలో చేరింది. మొదటినుండి తాను ఈ కూటమిలో ఏదో ఒక పార్టీ నుండి తిరిగి నరసాపురం నుండి పోటీ చెయ్యడం ఖాయం అని రఘురామ మీడియా లో చెబుతూ వచ్చారు. కొద్ది రోజుల క్రితం జరిగిన టీడీపీ-జనసేన-బీజేపీ , తాడేపల్లిగూడెం ప్రజాగళం సభలో కూడా రఘురామ ప్రసంగిస్తూ, తాను మరల నర్సాపురం నుండే కూటమి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాని ఆ సభలో అశేష జనవాహిని సమక్షలో ప్రకటించారు.
పొత్తుల ఖరారు, పోటీ చేసే సీట్ల ప్రకటన
పొత్తుల చర్చల్లో భాగంగా జనసేన 21 ఎమ్మెల్యే 2 ఎంపీ స్థానాలలో, అలాగే బీజేపీ క10 అసెంబ్లీ , 6 ఎంపీ స్థానాల్లో పోటీ చెయ్యాలని , నిర్ణయం అయింది. అయితే టీడీపీ నర్సాపురం తీసుకోవాల్సి వున్నా, పొత్తులో భాగంగా ,బీజేపీకి ఇచ్చి, ఆ స్థానం నుండి రఘురామ ను పోటీ చేయించాలని కోరగా అందుకు అంగీకరించిన బీజేపీ, తీరా చివరకు వచ్చేసరికి రఘురామ్ కు టికెట్ ఇవ్వకుండా, నర్సాపురం ఎంపీ సీట్ భూపతిరాజు శ్రీనివాస వర్మకు ప్రకటించడంతో ,రఘురామ కు పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లయింది . రఘురామ, జగన్ వత్తిడితో, సోము వీర్రాజు లాబీయింగ్ తో , తనకు టికెట్ దక్కకుండా పోయిందని, ఆరోపించారు . అయినా తాను వెనక్కి తగ్గనని ,జగన్ పై పోరాటం చేస్తూనే ఉంటానని మీడియా తో మాట్లాడుతూ చెప్పారు.
టీడీపీ అభిమానుల్లో ఆగ్రహావేశాలు
రఘురామ కు బీజేపీ టికెట్ ఇవ్వకపోవడం లో జగన్ హస్తం ఉందని, జగన్ ఇంకా మోడీ దత్త పుత్రుడే అని , బీజేపీ ని ఈ కూటమిలో భాగంగా ఎలా చూడాలని, నమ్మాలని ,బీజేపీ ని విమర్శిస్తూ సోషల్ మీడియా లో పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు టీడీపీ అభిమానులు.
అసలు రఘురామ బీజేపీ పార్టీ లో లేడని ,, తాము రఘురామ కు ఎలా టికెట్ ఇస్తామని బీజేపీ చేస్తున్న వాదనలకు ,టీడీపీ అభిమానులు కౌంటర్ ఇచ్చారు.
" వైసీపీ నుండి వచ్చిన గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ కు ఒక్క రోజులోనే, బీజేపీ పార్టీ లోకి జాయిన్ చేసుకుని, తిరుపతి ఎంపీ టికెట్ ఎలా ఇచ్చారు ? అసలు 0.5 శాతం వున్న ఓట్లు వున్న , బీజేపీ తో చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ఎందుకు పొత్తు పెట్టుకున్నారంటే, ఎన్నికల సమయంలో జగన్ చేసే అరాచకాలకు అడ్డుకట్టవేయాలంటే కేంద్ర బీజేపీ అవసరం అని, అంతే కానీ, బీజేపీ కి ఆంధ్ర లో ఏదో ఊడబొడుస్తుందని కాదు. అసలు బీజేపీ అన్ని సీట్లు గెలవాలంటే, టీడీపీ,జనసేన ఓటర్లు, బీజేపీ కి ఓట్లు వేస్తేనే వాళ్ళు గెలవగలరు, లేకపోతే, వాళ్ళకి డిఫాజిట్స్ కూడా రావు. రఘురామ కు టికెట్ ఇవ్వకపోతే, బీజేపీ పోటీ చేస్తున్న స్థానాల్లో టీడీపీ,జనసేన ఓట్లు పడవు , అప్పుడు మొత్తం బీజేపీ అన్ని స్థానాల్లో ఓటమి ఎదురయ్యే ఛాన్స్ ఉందని, టీడీపీ అభిమానులు బీజేపీ ని హెచ్చరిస్తున్నారు.
నర్సాపురంలో రఘురామ కన్నా పొటెన్షియల్ క్యాండిడేట్ ఎవరు ఉంటారు ?.. కానీ ఉద్దేశపూర్వకంగా ఆయనకు టిక్కెట్ దక్కనివ్వకూడదన్న లక్ష్యంతో అందరూ కలిసి ఆయనను దూరం పెట్టారు. ఆయనపై ఎందుకు అంత వ్యతిరేకత ?. జగన్ అరాచకాలపై ఆయన ప్రాణాలొడ్డి పోరాడారు. దానికే వ్యతిరేకత పెంచుకుంటారా ?. జగన్ పై పోరాడితే బీజేపీ నేతలకు ఎందుకు నొప్పి ? అనేది చాలా మందికి అర్థం కాని విషయం. వైసీపీ వద్దనుకున్న వరప్రసాద్ కు పిలిచి మరీ తిరుపతి ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. ఉదయం పార్టీలో చేర్చుకుని మధ్యాహ్నానికి టిక్కెట్ ఇచ్చారు. మరి జగన్ పై పోరాడుతున్న రఘురామకు ఎందుకివ్వలేదు. ?. ఆ సీటు కూటమిలో భాగంగా టీడీపీకే వదిలి పెడితే… వారే ఇచ్చుకునేవారు కదా !. తాము గతంలో గెలిచిన సీటు అని పట్టుబట్టి ఎందుకు తీసుకున్నారు ? అని టీడీపీ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు.
రఘురామ కు టికెట్ ఇవ్వకపోవడం, ఇప్పుడు కూటమి విశ్వసనీయత దెబ్బ తినే ప్రమాదం లో ఉందని, కొంతమంది బీజేపీ నేతలు కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే, చంద్రబాబు, పవన్, రఘురామ అంశం మీద చర్చించారని, రఘురామకు విజయనగరం ఎంపీ టికెట్ గాని, ఉండి ఎమ్మెల్యే టికెట్ గాని ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని కొంతమంది టీడీపీ నాయకులు మీడియా తో చెప్పారు.
వచ్చే 2 రోజుల్లో, రఘురామకు ,ఏదో ఒక టికెట్ అవకాశం వస్తుందని, టీడీపీ ,జనసేన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.