IND vs ENG: వైజాగ్ టెస్టుకు ముందు ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ

శుక్రవారం నుంచి భారత్‌తో రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతున్న వేళ ఇంగ్లండ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి గాయం కారణంగా ఇంగ్లండ్ స్టార్ స్పిన్నర్ జాక్ లీచ్ రెండో టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ లీచ్ గాయడపడ్డాడు. అతని మోకాలికి గాయమైంది. అయినప్పటికీ గాయంతో బాధపడుతూనే బౌలింగ్ చేశాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో రెండో టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా అధికారికంగా ధృవీకరించాడు. ‘‘దురదృష్టవశాత్తూ జాక్ లీచ్ రెండో టెస్టుకు దూరమయ్యాడు. అతడి కుడి కాలిలో వాపు వచ్చింది. జాక్ లీచ్ జట్టుకు దూరం కావడం మాకు గట్టి ఎదురుదెబ్బ. చాలా రోజుల తర్వాత జాక్ లీచ్ జట్టులోకి వచ్చాడు. కానీ ఇంతలోనే ఇలా జరగడం బాధకరం.’’ అని చెప్పాడు. కాగా హైదరాబాద్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 26 ఓవర్లు బౌలింగ్ చేసిన లీచ్ ఒక వికెట్ తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక వికెట్ తీశాడు.

Leave a Comment