హరి రామయ్య జోగయ్య, ముద్రగడ పద్మనాభం వైసీపీ కోవర్టులా ?……విశ్లేషణ

 

హరి రామయ్య జోగయ్య, ముద్రగడ పద్మనాభం వైసీపీ కోవర్టులా ?

హరి రామయ్య జోగయ్య

ఎప్పుడైతే 2023 సెప్టెంబర్ లో, పవన్ చంద్రబాబు ను జైలు లో కలిసి బయటకు వచ్చి, జనసేన టీడీపీ తో కలిసి పోటీ చేస్తోందని, పొత్తు ఖాయమని ప్రకటించాడో, అప్పటినుండి కాపు పెద్ద ,మాజీ మంత్రి చేగొండి హరి రామయ్య జోగయ్య పవన్ కు సలహాలివ్వడం, సూచనలు ఇవ్వడం బహిరంగంగా లేఖలు రాయడం ప్రారంభించారు. పవన్ ఎన్ని సీట్లు తీసుకోవాలో, ఎక్కడ పోటీ చెయ్యాలో కూడా ఆ లేఖల్లో ప్రస్తావించేవారు. తక్కువ తీసుకుంటే, కాపులకు అన్యాయం జరిగినట్టే అనే అన్యాపదేశంగా ప్రస్తావించినట్టు ఉండేవి, ఆ లేఖలు.

దానివల్ల జనసేన పార్టీ అంటే కేవలం కాపులకు మాత్రమే అని ప్రజలు భావించే విధంగా , ప్రజలలో అనుమానాలు రేకెత్తించే విధంగా, ఆయన లేఖల్లో అంశాలు వుండేవి. పైగా తాను పవన్ కు మిత్రుడంటారు జోగయ్య. ఏ వ్యక్తి తన మిత్రుడి క్షేమం కోరి ఇచ్చే సలహాలు, రాసే లేఖలు బహిరంగపరచరు , ఫోన్ లో చెబుతారు, లేదా వ్యక్తిగతంగా కలిసి చెబుతారు. పవన్ ఇమేజిని డామేజీ చేసేందుకు, జోగయ్య గారు రాసినట్టుగా, వైసీపీ కూడా కొన్ని ఫేక్ లెటర్స్ కూడా వదిలింది. కొద్ది రోజుల క్రితం , పవన్,చంద్రబాబు కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్ లో, జనసేన 24 సీట్లలో మాత్రమే పోటీ చేస్తుందని, పవన్ ప్రకటించండంతో, జోగయ్య గారు ,మరింత ఆవేశపడి, పవన్ 70 సీట్లలో పోటీ చెయ్యాలి, పవర్ షేరింగ్ తీసుకోవాలని , అలా చేయకుంటే, పవన్ తప్పు చేసినట్టే అని , మీడియా లో వ్యాఖ్యలు చేసారు, ఇవి ఆసరాగా తీసుకుని, వైసీపీ మీడియా రెచ్చిపోయి, పవన్, కాపులను చంద్రబాబు కు బానిసగా మారుస్తున్నాడని, పవన్ కు కాపు పెద్దలు ‘కాపు’ కాయమని చెబుతున్నట్టు గా వార్తలు రాశారు. విచిత్రం ఏమిటంటే, పదే పదే ఉచిత సలహాలు ఇస్తున్న ఈ జోగయ్యగారు, 2009 లో చిరంజీవి పాలకొల్లు లో పోటీ చేస్తే, ఖచ్చితంగా విజయం సాధిస్తాడని , చిరంజీవిని ఒప్పించి పాలకొల్లు లో పోటీ చేయిస్తే, చిరంజీవి అక్కడ పరాజయం పాలయ్యారు. జోగయ్యగారి వ్యూహాలు అప్పుడే ఘోరంగా దెబ్బ తిన్నాయి.

పవన్ ఖచ్చితంగా సీఎం స్థానం కోసం, టీడీపీ తో పవర్ షేరింగ్ తీసుకోవాలని పట్టుబడుతున్న జోగయ్య గారు, 2019 లో జనసేన అన్ని స్థానాల్లోనూ ఒంటరిగా పోటీ చేస్తే, కనీసం 10 స్థానాల్లో ఎందుకు గెలిపించలేకపోయారో ,. పవన్ రెండు చోట్లలో పోటీ చేస్తే ఈ జోగయ్య గారు కనీసం ఒక్క చోట కూడా , తన వ్యూహాలతో పవన్ ను ఎందుకు గెలిపించేలేకపోయారో మాత్రం చెప్పరు . ఇప్పుడు కూడా పొత్తు లేకుండా జనసేన ను అన్ని స్థానాల్లోనూ ఒంటరిగా పోటీ చెయ్యమని కూడా సలహా ఇవ్వచ్చు కదా, అది చెయ్యరు.

ముద్రగడ పద్మనాభం

ఇక ముద్రగడగారు, చంద్రబాబు సీఎం గా ఉండగా, అయన కాపులకు రిజర్వేషన్ కావాలని ఉద్యమం నడిపారు, ఆ ఉద్యమంలో, రత్నాచల్ ట్రైన్ తగలబడింది. ముద్రగడగారు కూడా కేసులను ఎదుర్కొన్నారు. . నిజానికి చంద్రబాబు చరిత్రలో, 2014 లో మొదటి సారిగా కాపులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ పెట్టారు, కాపులకు రిజర్వేషన్ కేటాయించాలని, అసెంబ్లీ లో బిల్లు పెట్టి,కేంద్రానికి పంపించారు. మోడీ ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు ఇచ్చిన EWS కోటాలో, 5% రిజర్వేషన్ కేవలం కాపులకు మాత్రమే కేటాయించారు. ఇంత చేసినా ముద్రగడ, చంద్రబాబు కు వ్యతిరేకంగా చేసిన ప్రచారం వల్ల , కాపులు మెజారిటీ శాతం, 2019 ఎన్నికల్లో చంద్రబాబు కు వోట్ వెయ్యలేదు, వైసీపీ కే వోట్ వేశారు. చంద్రబాబు ఓడిపోయారు. జగన్ సీఎం అయిన తరువాత, చంద్రబాబు కాపులకు కేటాయించిన 5% EWS రిజర్వేషన్స్ తొలగించారు, కాపు కార్పొరేషన్ కు చంద్రబాబు ఇచ్చినంత నిధులు కూడా జగన్ ఇవ్వలేదు, పైగా చంద్రబాబు కాపులకు ఇచ్చిన కాపు నేస్తం , కాపు విద్యార్థులకు విదేశీ విద్య, వంటి పథకాలన్నీ జగన్ రద్దు చేసాడు. ఇంత జరిగినా ముద్రగడ ఏమీ మాట్లాడలేదు, జగన్ ను ప్రశించలేదు , సైలెంట్ అయిపోయారు, పైగా తాను కాపు ఉద్యమం నుండి తప్పుకున్నట్టు ప్రకటించారు. దీనితో, కాపులకు అర్ధం అయింది, ముద్రగడ ఎజెండా కాపుల మేలు గురించి కాదని, కేవలం చంద్రబాబు ను అధికారం నుండి దించడానికి , వైసీపీ కి మేలు చేయడానికి చేసిన కోవర్ట్ ఆపరేషన్ అని.

అలా 2019 నుండి సైలెంట్ అయిన ముద్రగడ, పవన్ వారాహి యాత్ర చేస్తూ, తూర్పు గోదావరి యాత్ర మొదలు పెట్టగానే, మళ్ళా ఏక్టివ్ అయ్యారు. ఇష్టారీతిన సవాళ్లు చేసి పవన్ ను కించ పరిచారు. పవన్ ను ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిట్టిన, కాకినాడ వైకాపా ఎమ్మెల్యే, ద్వారంపూడినే తనకు చాలా ముఖ్యమన్నారు.పవన్ ను విమర్శిస్తూ, పవన్ కు దమ్ము ఉంటే తన పై పోటీ చేసి గెలవాలని సవాల్ చేస్తూ, బహిరంగ లేఖ రాసి, ఆ లేఖ మొదట్లో, పవన్ ను కించపరిచేలా ప్రముఖ కధా నాయకుడు, పవన్ గారికి అని సంబోధించి, జన సైనికుల ఆగ్రహానికి గురి అయ్యారు.

2024 ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేద్దామని ముద్రగడ తలచారు, అయితే, ఆయనకు వైసీపీ టికెట్ రాదని అర్ధం అయిందో ఏమో, హఠాత్తుగా.. వైసీపీతో తనకు పడదని .. తాను టీడీపీ, జనసేన లో చేరుతానని చెప్పుకొచ్చారు. తన ప్రకటన తరువాత, పవన్ తన ఇంటికి వచ్చి, తనను కలుస్తాడని భావించిన, ముద్రగడ, పవన్ రాకపోవడంతో, అసహనానికి గురి అయ్యారు. ఆ రెండు పార్టీలు ఆయనను దగ్గరకు రానీయకపోవడంతో… మళ్లీ ఆయన కూడా సీట్ల పంపకాల పేరుతో, టీడీపీ తో పవర్ షేరింగ్, అంశాలతో పవన్ కు సలహాల లేఖలు ప్రారంభించారు. అదీ కూడా కాపు లెక్కలతో. అయినా పవన్,
ముద్రగడను పట్టించుకోకపోవడంతో, మరోసారి యూ టర్న్ తీసుకున్న ముద్రగడ , వైసీపీ తరుపున, పవన్ కు ప్రత్యర్థిగా పోటీ చెయ్యడానికి సిద్ధం అవుతున్నారనే వార్తలు వస్తున్నాయి.

ఆయన ఎజెండా అందరికీ తెలిసిన విషయమే. నిజానికి ముద్రగడ వైసీపీకి సన్నిహితమని అందరికీ తెలుసు. తర్వాత ఎందుకు విబేధాలొచ్చాయో ఎవరికీ తెలియదు. కానీ పవన్ కల్యాణ్ పార్టీలో చేరి ఆయనను డీఫేమ్ చేయడానికి ఓ ప్రణాళిక ప్రకారం .. కోవర్ట్ ఆపరేషన్ చేయడానికి, ఆయన ప్లాన్ చేసుకున్నారని, దాన్ని గమనించి.. పవన్ సైలెంట్ అయ్యారని అంటున్నారు. ఇప్పుడు పిఠాపురం నుంచి పవన్ పై వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా ప్రకటించిన వంగా గీత.. మాత్రం పవన్ పిఠాపురం లో పోటీ చేస్తే తాను పోటీ చేయలేనని చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఈ కాపు పెద్దల వైఖరికి విసిగిపోయిన పవన్, ఈ నెల 28 న జరిగిన తాడేపల్లి గూడెం, జెండా సభలో, తన మీద విమర్శలు చేస్తున్న, కాపు పెద్దలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తనకు కావలిసింది, సలహాలు చెప్పేవారు కాదని, యుద్ధం చేసేవారు కావాలని, ఆర్ధికంగా తనకు ఇబ్బందులు ఎదురైనా , తనకు ఎవరు సహాయం చేయకపోయినా , 10 సంవత్సరాలనుండి, అవమానాలు పడుతూ పార్టీ ని నడుపుకు వస్తున్నాని, తమకు కావలిసిన స్థాయిలో బూత్ లెవెల్ లో పని చేసే కార్యకర్తల యంత్రాంగం లేదని, ఎక్కువ ఖర్చుపెట్టే స్థితిలో లేమని, అన్ని ఆలోచించే, లెక్కవేసే, 24 సీట్లు తీసుకున్నామని ఎన్ని సీట్లు తీసుకోవాలో, తాను ఏం చేయాలో.. ఏం చేయాలో స్పష్టత ఉందన్నారు. తనను ప్రశ్నించకుండా తనతో పాటు నడిచేవారే తన వారని తేల్చి చెప్పారు. దీంతో సొంతపార్టీలో ఉండే.. జగన్ కు పరోక్షంగా మద్దత్తు ఇస్తున్న బ్యాచ్‌కు గట్టి స్ట్రోక్ ఇచ్చినట్లయింది. అదే సమయంలో టీడీపీ వెనుక తాను నడవడం లేదని..టీడీపీ తో కలిసి నడుస్తున్నామని స్పష్టం చేశారు.

అయితే తాజా పరిణామాలు ఏమిటంటే, ఇప్పటిదాకా జనసేన లో వున్న , జోగయ్యగారి కుమారుడు సూర్య ప్రకాష్, జనసేన కు రాజీనామా చేసి, వైసీపీ లో జాయిన్ అయిపోయాడు. తాడేపల్లి లో, జగన్ చేత కండువా కప్పించుకున్న సూర్య ప్రకాష్, వెను వెంటనే , జనసేన పార్టీ లో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని , పవన్ మీద , విమర్శలు గుప్పించడంతో, జోగయ్యగారి ముసుగు తొలగి పోయిందని జనసైనికులు ఆరోపిస్తున్నారు. తన కుమారుడి నిర్ణయానికి తనకు సంబంధం లేదని జోగయ్య చెబుతున్నారు. కుమారుడినే ఒప్పించలేని జోగయ్య, అయన చెప్పే సలహాలు, సూచనలు పవన్ పాటించాలని డిమాండ్ చెయ్యడం హాస్యాస్పదం గా ఉందని జనసైనికులు కౌంటర్ ఇస్తున్నారు. తాను మాత్రం చనిపోయేదాకా జనసేన తోనే ఉంటానని, జోగయ్యగారు అంటున్నారు.

మొత్తం మీద తాజా పరిణామాలు,సంఘటనలతో, కాపు పెద్దలుగా చలామణి అవుతున్న ముద్రగడ, జోగయ్య గారు తమ అభిప్రాయాలు, సూచనలు, పవన్ కు బహిరంగ లేఖలు రూపంలో ఇవ్వడం, ,తద్వారా పరోక్షంగా వైసీపీ కి సహకరించే, కోవర్ట్ చర్యలకు ఇక ఫుల్ స్టాప్ పడినట్టే అని పవన్ అభిమానులు సంతోషిస్తున్నారు. ఇప్పటిదాకా పవన్ కు ఈ ఇద్దరి కాపు నాయకుల వల్ల ఏర్పడిన ముప్పు, తలనొప్పి తొలగిపోయింది కాబట్టి, ఇకనుండి పవన్ , జనసేన పోటీ చేసే 24 స్థానాల్లోనూ, ప్రచారం మీద ద్రుష్టి సారించి, జనసేన 24 స్థానాల్లోనూ గెలిచే విధంగా ప్రచారం చెయ్యడానికి ఎన్నికల ప్రచార రంగం లోనికి దూకాలని ,జనసేన అభిమానులు కోరుకుంటున్నారు. .

 

 

1 thought on “హరి రామయ్య జోగయ్య, ముద్రగడ పద్మనాభం వైసీపీ కోవర్టులా ?……విశ్లేషణ”

Leave a Comment